ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

6.06.2011

రాష్ట్రంలోని కేజీబీ పాఠశాలలలో టాప్ రాంకర్ ప్రసన్న


వివిధకారణాలతో చదువుమానివేస్తున్న ఆడపిల్లలకోసం కస్తూరిబా బాలికలగురుకులపాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. అక్కడ చదువుతున్న ఆడపిల్లలు కార్పోరేట్ పాఠశాలలకంటె మెరుగైన ఫలితాలు సాధిస్తూ ముందుకు దూసుకు వెళుతున్నాయి . ఈసంవత్సరం జరిగిన పదవతరగతి పరీక్షలలో రాష్ట్రం మొత్తంలోని ఈపాఠశాలలలో చదివిన విద్యార్థులలో నూజండ్ల కెజిబి లోచదివిన విద్యార్థిని మాదాలప్రసన్న టాపర్ గానిలచింది . 570 మార్కులు సాధించి పేదరికంలోనుంచివచ్చిన పిల్లలు అవకాశమిస్తే తమసత్తా చూపిస్తారని నిరూపించింది . నూజండ్ల కెజిబి కి ఒకప్రత్యేకత తెచ్చిన ఈ అమ్మాయిని ఈరోజు జరిగిన ఒకకార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అభినందించి సత్కరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ ,ఎమ్ ఈ ఓ వరప్రసాద్ ,మండల సర్పంచులు ఎమ్ పీ టీసీ సభ్యులు అభ్నందించి ఆర్ధికప్రోత్సాహాన్నందించారు . ఈ సందర్భంగా అంకితభావంతో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్న ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ గారిని ప్రజాప్రతినిధులు కొనియాడారు.

కోటిరూపాయల వ్యయంతో ములకలూరులో మహాదేవుని ఆలయం


నూజండ్లమండలం ములకలూరు గ్రామంలో కోటిరూపాయలవ్యయంతో నిర్మించిన రామలింగేశ్వరుని ఆలయంలో ప్రతిష్ఠామహోత్సవాలు ఈరోజు ముగిశాయి. గ్రామసమీపంలోని గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నపురాతన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తులు గ్రామంలోకి తరలించి పునఃనిర్మాణం గావించారు. నిన్నటివరకు రాజకీయ కక్షలతో అట్టుడికి వివాదలగ్రామంగా పేరుపొందిన గ్రామంలో ఈ నిర్మాణంతో రుగ్మతలన్నీ సమసిపోయి అపూర్వమైన ఐక్యతవెల్లివిరిసింది. గ్రామక్షేమంకోసం తమ విబేధాలను పక్కనబెట్టి గ్రామమంతా ఈ యజ్జ్ఞానికి నడుంకట్టారు. స్వంతగా కోటిరూపాయలు సమకూర్చుకుని గ్రామగ్రామమంతా అహర్నిశం శ్రమించి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈసందర్భంగా బంధువులతోను భక్తులతోనూ గ్రామం కిక్కిరిసి తిరుణాళ్లవాతావరణాన్ని తలపింపజేసింది.